ఢిల్లీ అల్లర్లు: ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ మృతి

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని భగ్గుమంటోంది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో సోమవారం మొదలైన ఘర్షణలు.. నేటికీ తగ్గుముఖం పట్టలేదు. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఢిల్లీలో పర్యటిస్తుండగానే మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, గోకుల్‌పురి, భజన్‌పురా, జఫరాబాద్‌లలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో 20 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఇక ఈ ఘర్షణల్లో ఇప్పటికే హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ మృతి చెందగా.. మంగళవారం రాత్రి ఇంటలెజిన్స్‌ విభాగం కానిస్టేబుల్‌ అంకిత్‌ శర్మ మృత్యువాత పడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌ బాగ్‌లో బుధవారం ఉదయం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అంకిత్‌ శర్మపై దాడి చేసి.. ఆయనను హతమార్చినట్లు సమాచారం. అనంతరం ఆయన మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసినట్లు తెలుస్తోంది.(ఢిల్లీ అల్లర్లు: 20కి చేరిన మృతుల సంఖ్య!)